వికలాంగుల పింఛన్ల పెంపు ఎవరి దయాదాక్షిణ్యాలు కాదు

కామారెడ్డి: వికలాంగులకు పెరిగిన పింఛన్ ఎవరి దయాదాక్షిణ్యాలు కాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాలులో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. వికలాంగులకు తెలంగాణలో 3016, ఏపీలో 3 వేల పింఛన్ ఇవ్వడం తమ పోరాట ఫలితమేనన్నారు. 2023 ఎన్నికల వరకు మహాజన సోషలిస్టు పార్టీ రాజకీయంగా ఎడగబోతుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోరాట ఫలితమే పింఛన్ల పెంపు అని చెప్పారు. వ‌చ్చే ఎన్నికల్లో మహాజన సోషలిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి పింఛన్లను రెండింతలు పెంచుకుంటామని పేర్కొన్నారు. అన్ని వర్గాలను సమీకృతం చేసుకుంటూ రాజ్యాధికారం సాధించుకునే దిశగా ముందుకి వెళ్తామని చెప్పారు. తెలంగాణలో వికలాంగుల సంక్షేమ శాఖను నిర్వీర్యం చేసారని అన్నారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు శాఖలు ఉన్నాయని, వికలాంగుల శాఖను ఇతర శాఖలో విలీనం చేసి ఆ శాఖ అస్తిత్వం లేకుండా చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో ఎంఎస్పీ గెలిచి ప్రస్తుతం ఉన్న మూడు వేల పింఛన్లను 6 వేలకు పెంచుకుంటామని తెలిపారు. వికలాంగుల శాఖను పునరుద్ధరించడంతో పాటు వికలాంగుల వర్గం నుంచి మంత్రులు ఉండేలా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.