విజిల్ వేసే ఈల గొంతులో అడ్డుపడి బాలిక మృతి
పాట్నా: పిల్లలు విజిల్ వేయడానికి ఉపయోగించే ఈల గొంతులో అడ్డుపడి బాలికి చనిపోయిన ఘటన బీహార్‌లోని ముంగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. చోర్గావ్ గ్రామంలో సోమవారం ఖుష్బు (8) అనే బాలిక ప్లాస్టిక్ ఈలతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు గొంతులో అడ్డుపడింది. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడి ఉక్కిరిబిక్కిరైన కుమార్తెను గమనించిన తల్లిదండ్రులు తొలుత అసర్‌గంజ్‌లోని ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యుడు భాగల్పూర్ జిల్లాలోని మాయగంజ్ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పడంతో ఆటోలో అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు మళ్లీ పాట్నాలోని ఆసుపత్రికి తీసుకువెళ్లమని సూచించారు. దాంతో చేసేదేమీలేక మళ్లీ బాలికను ఆటోలో అక్కడికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మరణించిందని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఆపదలో ఉన్న తమ కూతురికి వైద్యం అందించక వైద్యులు ఆసుపత్రులు తిప్పి సమయం వృథా చేశారని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు.