విశాఖ గీతం వర్సిటీ నిర్మాణాల కూల్చివేత
విశాఖ : ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించారంటూ విశాఖ గీతం విశ్వవిద్యాలయంలోని కొన్ని కట్టడాలను జివిఎంసి అధికారులు తొలగిస్తున్నారు. విశాఖ నగర శివారు రుషికొండ సమీపాన పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకున్న గీతం యూనివర్సిటీ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే విశాఖ గీతం వర్సిటీ గోడలను కొంతవరకు అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి, అక్రమ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించి జెసిబి లతో కూలగొడుతున్నామని అధికారులు తెలిపారు. విశ్వ విద్యాలయ ప్రధాన ద్వారం, ప్రహరీ గోడ కొంత భాగం, సెక్యూరిటీ గదులను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. దాదాపు 40 ఎకరాలు గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నట్లు రెవెన్యూ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆర్డీవో కిషోర్ పర్యవేక్షణలో రెవిన్యూ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రుషికొండ, ఎండాడలోని 40.51 ఎకరాల్లో గీతం యాజమాన్యం చేపట్టిన నిర్మాణాలపై విచారణ చేపడుతున్నారు. మరోవైపు గీతం వర్సిటీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బయటి వ్యక్తులను బీచ్ రోడ్డు వైపు అనుమతించడం లేదు. బీచ్ రోడ్డుకు వెళ్లే రెండు వైపులా మార్గాలను అధికారులు మూసేశారు. విషయం తెలిసిన టిడిపి శ్రేణులు గీతం విశ్వవిద్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. ఎలాంటి నోటీసులను ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ.. గీతం యాజమాన్యం ఆరోపిస్తుంది. ఎందుకు కూల్చివేస్తున్నారో చెప్పడం లేదంటోంది.