వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో ఏడుగురు మృతి

హైద‌రాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో ఏడుగురు దుర్మ‌ర‌ణం చెందారు. బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్‌ గ్రామశివారులోని బుగ్గవాగు వద్ద చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం జాతీయ రహదారిపై శనివారం జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో టమాటాల లోడుతో వెళుతున్న మినీ లారీ అదుపుతప్పి, గోపాలపురం శివారు వద్ద బైక్‌ ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్‌ పై ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అలాగే విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.

వివ‌రాల్లోకి వెళ్తే…

ఖ‌మ్మం జిల్లాలో
బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్‌ గ్రామశివారులోని బుగ్గవాగు వద్ద చోటు చేసుకుంది. స్నేహితుడి వివాహానికి హాజరై.. తిరిగి నిన్న రాత్రి బైక్‌ పై వస్తుండగా బుగ్గవాగు మూలమలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇద్దరు యువకులు శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను పండితాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్‌ (24), సాయి (23) లుగా గుర్తించారు.

తూ. గో జిల్లాలో..
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదంలో.. కడప జిల్లా మైదకూరు నుంచి కాకినాడకు టమాటాల లోడుతో వెళుతున్న మినీ లారీ అదుపుతప్పి, గోపాలపురం శివారు వద్ద బైక్‌ ను ఢకొీంది. ఈ ప్రమాదంలో బైక్‌ పై ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులను గోపాలపురం గ్రామానికి చెందిన సతీశ్‌ (21), చంటి (20), కొత్తపేట మండలం కండ్రిగ గ్రామానికి చెందిన సురేందర్‌ గా పోలీసులు గుర్తించారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో..
విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో స‌మీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తెర్లాంకు చెందిన మామిడి రాము ఆటో సీతానగరం నుంచి బొబ్బిలి వైపు వస్తుండగా, బొబ్బిలి నుంచి సీతానగరం వైపు వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడి నుజ్జునుజ్జు అయ్యింది. ఆటో డ్రైవర్‌ రాము, ఆటోలో ప్రయాణిస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థి పి.సాయిప్రదీప్‌ దుర్మరణం చెందారు. వెంటనే బొబ్బిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆటోలో నుండి బయటకు లాగి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

Leave A Reply

Your email address will not be published.