వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి ఇవాళ (మంగళవారం) కరోనా టీకా వేయించుకున్నారు. హైదరాబాద్లోని గాంధీ దవాఖానాలో ఆయన తొలి డోసు టీకా తీసుకున్నారు. కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రభుత్వ దవాఖానల్లో టీకాలు ఇస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీకా తీసుకునే సమయంలో తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ కూడా అక్కడే ఉన్నారు. కోవాగ్జిన్ టీకాను ఆయన వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కి, 45 ఏళ్ళు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సెంటర్ లలో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితమని పేర్కొన్నారు. ప్రైవేట్ లో 250 రూపాయల కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వొద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో 91 కేంద్రాల్లో వాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయని.. ఇందులో ప్రభుత్వ కేంద్రాలు 45 ఉన్నాయని తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తారు.