శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాద కలకలం
మాక్‌డ్రిల్ నిర్వహించామన్న అధికారులు

అమ్రాబాద్: శ్రీశైలం జలాశయం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాద ఘటన కలకలం సృష్టించింది. భారీగా మళ్లీ మంటలు చెలరేగడంతో పవర్ హౌజ్ లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్లగా… అమ్రాబాద్ మండల పరిధిలోని దోమలపెంట సమీపంలో గల తెలంగాణ జెన్కో శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో గత నెల 20 న అగ్నిప్రమాదం కారణంగా 9 మంది దుర్మరణం చెందారు. దీంతో పవర్ హౌజ్ పూర్తిగా నిరుపయోగంగా మారింది. తాత్కాలిక ఉద్యోగులు, ఇంజనీర్లు గత వారం రోజులుగా భయం భయంగానే అధికారుల వత్తిడితో మరమ్మతుల పనిలో మునిగిపోయారు. కాగా బుధవారం లాగేజీతో వచ్చిన డిసిఎం రివర్స్ లో వెళ్లి తాత్కాలికంగా పెట్టిన విద్యుత్ ఎంసిపి బాక్సును ఎక్కడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ మరమ్మత్తులు నిర్వహిస్తున్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కాగా ఈ ఘటనపై జెన్కో అధికారులు పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని జవాబిచ్చారు. ఈ ఘటనతో మరమ్మతులకు వచ్చే వారు పనికి రావాలంటే భయంతో వణికిపోతున్నారు. మాక్ డ్రిల్ అని తెలియడంతో సిబ్బంది, స్థాకులు ఊపిరి పీల్చుకున్నారు.