సిద్దిపేటకు నేడు గోల్డెన్ డే : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : సిద్దిపేటకు నేడు ‘గోల్డెన్ డే’ అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని, మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దాదాపు రూ. వెయ్యి కోట్ల అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నట్లు తెలిపారు. 2,460 డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ప్రభుత్వ వైద్య కళాశాల, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, రంగనాయక సాగర్ గెస్ట్‌హౌజ్ ఇలా పలు కార్యక్రమాలను ప్రారంభించుకున్నామని చెప్పారు. సిద్దిపేట ముద్దుబిడ్డగా, శాసనసభ్యులుగా మన సిద్దిపేటకు రాష్ట్రంలోనే ఇంటింటికి తాగునీరు అందించారని, సిద్దిపేట నియోజకర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించిన తర్వాత మొదటిసారి సీఎం కేసీఆర్ విచ్చేశారని పేర్కొన్నారు. సీఎం ఆశీస్సులు, కలెక్టర్, అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించికున్నట్లు తెలిపారు.
‘డబుల్ బెడ్‌రూం పథకం’.. ముఖ్యమంత్రి కేసీఆర్ కల..
డబుల్ బెడ్‌రూం పథకం.. సీఎం కేసీఆర్ కల అని, ఇది ఎవరో అడిగింది కాదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో పాలకులు నిర్మించిన ఇండ్లు మురికి కూపాలు, స్లమ్‌లుగా ఉండేవని, పేదలంటే వారికి చిన్నచూపని అన్నారు. కానీ నేడు టీఆర్‌ఎస్ సర్కారు నిరుపేదలకు సకల సదుపాయాలతో కాళ్లకు మట్టి అంటకుండా ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని చెప్పారు. అయితే, తమ పట్టణంలో ఇంకా కొంతమంది ఇండ్లు రానివారు ఉన్నారని, సీఎం కేసీఆర్ పెద్దమనసుచేసుకొని మరో వెయ్యి డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంజూరుచేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. అలాగే, బస్తీ దవాఖానను కూడా మంజూరుచేయాలని సీఎంను వేడుకుంటున్నానన్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించాలని కోరుకుంటున్నాని మంత్రి చెప్పారు. రూ. 45 కోట్లతో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తున్నామని, దాదాపు రెండువేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.