సీఎం జగన్ పై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: వైఎస్‌ జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఆయనపై దాఖలైన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. మీడియాకు లేఖ విడుదలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరగా.. గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రశ్నించారు. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి పిటిషన్లు దాఖలు చేయడమేంటని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు జరపాలా? వద్దా? అన్నది సీజేఐ పరిధిలోని అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. సీఎం పదవి నుంచి తొలగించాలనే అభ్యర్థనకు విచారణ అర్హత లేదని, లేఖలో అంశాలపై ఇప్పటికే వేరే సుప్రీం బెంచ్ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. పిటిషన్లలో అభ్యర్థనలు అన్ని గందరగోళంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఎక్కడిదని, నిధులు ఎక్కడివని, ధర్మాసనం ప్రశ్నించింది. లేఖలోని అంశాలపై ఎంత మంది జోక్యం చేసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాఖలైన మూడు పిటిషన్లలో రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Leave A Reply

Your email address will not be published.