సోషల్ మీడియా కార్యకర్తలను విస్మరించం: విజయసాయిరెడ్డి
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల సోషల్ మీడియా కార్యకర్తల ఆత్మీయ సమావేశం గురువారం తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణమండపంలో జరిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు శ్రీ వి.విజయసాయిరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి పునాది రాళ్ళు – సోషల్ మీడియా సైనికులని ఈ సందర్భంగా మాట్లాడిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. జగన్ గారిని అభిమానించే మీరంతా మా కుటుంబ సభ్యులని చెప్పారు. సోషల్ మీడియా అందరికీ మంచి భవిష్యత్తు ఉందనీ… బాధ్యతగా మెలగాలనీ సూచించారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ పార్టీలో సమర్ధులైన నాయకులుగా ఎదగాలని వారు పిలుపునిచ్చారు.
వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు అని, ఎవరికీ అన్యాయం జరగనివ్వం అని భరోసా ఇచ్చారు. వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే….
పార్టీ అధికారంలోకి రావడానికి గల బలమైన కారణాల్లో సోషల్ మీడియా ఒకటి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా… ఎవరూ మిమ్మల్ని అడగకుండానే మీ అభిమానాన్ని సోషల్ మీడియా రూపంలోకి మార్చి ఇటు పార్టీకి అటు జగన్ గారికి అండగా నిలిచిన మీ కృషి మరువలేనిది. తెలుగుదేశం రాక్షస పాలనలో కూడా అష్టకష్టాలకు ఓర్చి మీరు గట్టి పునాదిలా నిలిచారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో నాయకులు మీకు అండగా నిలబడి ఉండొచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో లేకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ జగన్ గారిని అభిమానించే మీరంతా మా సొంత కుటుంబ సభ్యులు. జగన్ గారి తరుపున మీ అందరికీ శిరసు వంచి ప్రణామం చేస్తున్నాను. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మీరంతా నాయకులుగా ఎదగండి. మిగిలిన పార్టీల కల్చర్ మన పార్టీలో ఉండదు. కాబట్టి మనం పోరాడుతుంది మీడియాపై బాగా పట్టున్న ప్రత్యర్ధులతో అన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇష్యూ బేస్డ్ పోస్టులు పెడుతూ ఉండాలి. ఉదాహరణకు అసెంబ్లీలో జరుగుతున్న టిడ్కో ఇళ్ళ గొడవనే తీసుకుంటే దానిపై పూర్తి వాస్తవాలతో కూడిన వివరణలతో ప్రత్యర్ధులు నోరెత్తకుండా చేయాలి. తద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు చిటికేస్తే మేమున్నామని ముందుకు దూకేలా మన పనితీరు ఉండాలి. మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. అందుకే మరింత బాధ్యతగా మెలగండి. ఈ సమావేశంలో కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.