స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి హెటిరో ఒప్పందం!

భారత్‌లో స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉత్పత్తి -తొలిదశలో 10కోట్ల డోసులు

హైద‌రాబాద్‌: ఇప్పటికే ఆవిష్కరణకు నోచుకున్న ఏకైక కొవిడ్-19 వ్యాక్సిన్.. రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వీ ఇక భారత్ లోనూ ఉత్పత్తి కానుంది. ఇండియాలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రొడక్షన్ కు సంబంధించి శుక్రవారం కీలక ప్రకటనలు వెలువడ్డాయి. భారత ఫార్మా దిగ్గజం హెటిరో సంస్థతో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) మధ్య ఈ మేరకు కుదిరిన అవగాహన ఒప్పందాలను ఆయా సంస్థలు వెల్లడించాయి.

రష్యా తయారీ స్పుత్నిక్ వ్యాక్సిన్ ను భారత్ లో హెటిలో ఉత్పత్తి చేయనుంది. ఏడాది కాలానికిగానూ కుదిరిన ఒప్పందంలో భాగంగా తొలి దశలో 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేయనున్నారు. 2021 ప్రారంభం నుంచే ఉత్పత్తి ప్రక్రియ మొదలుకానుందని ఆయా సంస్థలు తెలిపారు. రష్యా.. ప్రపంచ దేశాలకు అందించాలనుకుంటోన్న డోసులన్నీ దాదాపు ఇండియాలోనే ఉత్పత్తి కానున్నాయి.

”కొవిడ్ చికిత్సలో అత్యంత కీలకంగా, సమర్థవంతంగా వ్యవహరిస్తోన్న స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ను భారత్ లో ఉత్పత్తి చేయనుండటం గర్వకారణమని, రష్యాతో ఒప్పందాలు సంతోషకరమని హెటిరో సంస్థ డైరెక్టర్ మురళికృష్ణారెడ్డి అన్నారు. ఇండియాలో ప్ర‌స్తుతం స్పుత్నిక్ టీకాకు చెందిన రెండ‌వ‌, మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది మార్చిలోగా ట్ర‌య‌ల్స్‌ను పూర్తి చేయ‌నున్నట్లు ఆయన చెప్పారు.

అత్యంత ప్రభావవంతమైన, సురక్షితమైన స్పుత్నిక్ వ్యాక్సిన్లను భారత్ గడ్డపై ఉత్పత్తి చేయనుండటం ఆనందంగా ఉందని, హెటిరో సంస్థకు ధన్యవాదాలు చెప్పుకోవాలని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ డిమిత్రివ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలిక క్లినికల్ ట్రయల్ ఫలితాలు మొదటి మోతాదు తర్వాత 42 వ రోజు 95% సామర్థ్యాన్ని చూపాయని ఆయన గుర్తుచేశారు.

Leave A Reply

Your email address will not be published.