అంతర్వేదిలో యుద్ధ ప్రాతిపదికన రథ నిర్మాణం
మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లు బోయిన వేణు
అమలాపురంః భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు, రాబోయే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణ ఉత్సవాలకు నూతన రథాన్ని సిద్దం చేయడం జరుగుతుందని ఎపి రెవెన్యూ శాఖ మంత్రి,మరియు జిల్లా ఇంచార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం అంతర్వేదిలో చేపట్టిన నూతన రథం నిర్మాణ పనులకు ఇంచార్జి మంత్రి కృష్ణదాస్, రాష్ట్ర బిసి వెల్ఫేర్ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ తో కలిసి శాస్త్రోక్త పూజలు నిర్వహించి ప్రారంభించారు. తదుపరి స్వామి సన్నిధిలో అర్చకుల ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ సుదర్శన నరసింహ మహా శాంతి హోమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ ఇటీవల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి రథం దగ్ధమవ్వడం అత్యంత దురదృష్ట కరమైన సంఘటన అని ఈ సంఘటనపై ఇప్పటికే సీబీఐ ఎంక్వరీ జరుగుతోందని,సంఘటనకు బాధ్యులైన వారిపై ఎంతటి పెద్దవారైనా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇంచార్జి మంత్రి తెలిపారు. హిందూ సంస్కృతి,సాంప్రదాయాల పట్ల అత్యంత నిబద్దత కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ప్రజలు, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అతి త్వరలో స్వామి వారి రథాన్ని స్థానిక మంత్రివర్యులు,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం సమయానికి రథాన్ని సిద్దం చేయడం జరుగుతుందనీ ఇంచార్జి మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలోని అన్ని దేవాలయాల సంరక్షణా భాద్యతలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, ఏ విధమైన విమర్శలకు తావు లేకుండా అతి తొందరలోనే రథాన్ని తయారు చేసి స్వామివారి కళ్యాణానికి సిద్దం చేయడం జరుగుతుందనీ ఇంచార్జి మంత్రి తెలియ చేశారు. రాష్ట్ర బిసి వెల్ఫేర్ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరూ తరించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన నూతన రథం నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. ధర్మ రక్షణకు ఏ విధమైన విఘాతం కలుగకుండా ముఖ్య మంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నారని,జరిగిన అపశృతి ని తొలగించి భక్తుల మనోభావాలకు అనుగుణంగా నూతన రథం నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మంత్రులకు, అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులు కు ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేస్తూ యుద్ద ప్రాతిపదికన రథం నిర్మాణానికి చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు.ధర్మాన్ని రక్షించేందుకు ముఖ్యమంత్రి అన్ని శక్తులు వొడ్డుతారని మంత్రి తెలియ చేసారు.జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ నూతన రథం నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వామివారి కళ్యాణానికి ముందే రథాన్ని సిద్దం చేయడం జరుగుతుందని,దేవాదాయ శాఖ,రెవెన్యూ,తదితర శాఖల ఆధ్వర్యంలో అతి తొందరలో రథాన్ని తయారు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాద్,పి.గన్నవరం శాసన సభ్యులు కొండేటి చిట్టిబాబు,ముమ్మిడివరం శాసన సభ్యులు పొన్నాడ సతీష్ కుమార్,దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ డి.భ్రమరాంబ,డిప్యూటీ కమిషనర్ బీవీఎస్.దుర్గా ప్రసాద్,శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అసిస్టంట్ కమీషనర్ భద్రాజి తదితరులు పాల్గొన్నారు. కాగా రథం నిర్మాణానికి ప్రభుత్వం రూ.95 లక్షలు కేటాయించింది. 1330 ఘనపుటడుగుల బస్తర్ టేకు కలప రథం నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. మూడు నెలల్లో రథం నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు సంకల్పించారు.