అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా
లాక్డౌన్ దిశగా పలు నగరాలు
వాషింగ్టన్: అగ్రరాజ్యాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేవలం వారం రోజులలోనే 11 లక్షలకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని పలు నగరాలు మళ్లీ లాక్డౌన్ దిశగా సాగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన అమెరికాలో ఇప్పటివరకు 1,20,19,960 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 2,55,414 మంది బాధితులు మరణించారు. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 11 మిలియన్ల నుంచి 12 మిలియన్లకు కరోనా కేసులు చేరాయి. దీంతో వచ్చే రెండు మూడు వారాలపాటు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తిచేస్తున్నారు.
న్యూయార్క్ నగరంలో అత్యధిక కేసులు నమోదవుతుండటంతో ఇప్పటికే పాటశాలలను మూసివేశారు. దీంతో 10 లక్షలకుపైగా విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అదేవిధంగా శనివారం నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు. దేశంలో మూడో అతిపెద్ద నగరమైన చికాగోలో గత సోమవారం నుంచి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.