అభ్యర్థుల మధ్య 15న జరిగే డిబేట్ రద్దు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్‌ల మధ్య అక్టోబర్ 15న జరిగే వర్చువల్ డిబేట్ రద్దు చేసినట్లు డిబెట్ కమిషన్ ప్రకటించింది. ట్రంప్ కరోనా బారిన పడిన నేపథ్యంలో ఈ ముఖాముఖి చర్చను కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్(సీపీడీ) వర్చుల్ పద్దతిలో జరపాలని నిర్ణయించింది. కానీ, ట్రంప్ దీనికి ఒప్పుకోకపోవడంతో ఈ డిబేట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు సీపీడీ శుక్రవారం ప్రకటించింది. డిబేట్‌పై ఇద్దరు అభ్యర్థులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారని కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో అక్టోబర్ 15న ఎటువంటి చర్చను నిర్వహిచడం లేదని తెలిపింది. అయితే అక్టోబర్ 22న టెనస్సీ నాష్‌విల్లేలో జరిగే తుది డిబేట్‌పై ఎటువంటి ప్రకటన చేయలేదు. తొలుత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ వర్చువల్ డిబేట్లో పాల్గనేందుకు నిరాకరించగా, ట్రంప్ కరోనా బారిన పడటంతో.. ముఖాముఖి చర్చకు జోబిడెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్చువల్ డిబేట్‌ను ట్రంప్ నిరాకరించడం సిగ్గుచేటని బిడెన్ వ్యాఖ్యానించారు. కాగా, 1976 నుండి అధ్యక్ష ఎన్నికలకు ముందు అభ్యర్థుల మధ్య డిబేట్ నిర్వహించడం అమెరికాలో సాంప్రదాయంగా వస్తుంది.