అమెజాన్ సిబ్బందిలో 20 వేల మందికి కరోనా
శాన్‌ఫ్రాన్‌సిస్కో : కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు తమ సంస్థలో పనిచేసే దాదాపు 20 వేల మంది ఉద్యోగులు కరోనా బారిన పడినట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. 1.37 మిలియన్‌ల ఫ్రంట్‌లైన్ కార్మికుల డేటాతో పాటు యునైటెడ్ స్టేట్స్‌లోని హోల్ ఫుడ్స్ మార్కెట్, కిరాణా దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులతో కలిపి కరోనా పాజిటివ్‌ల రేటు ఊహించిన దానికంటే తక్కువ రేటును చూపించిందని అమెజాన్ గురువారం ప్రకటనలో పేర్కొంది. కరోనా సమయంలో తమ రక్షణకు సంబంధించిన భద్రతా ప్రమాణాలతోపాటు కరోనా బారిన పడిన సహచరుల పట్ల సమాచారాన్ని వెల్లడించేందుకు సంస్థ ఇష్టపడటం లేదని పేర్కొంటూ అమెజాన్ ఉద్యోగులు కొందరు విమర్శలు చేయడంతో కంపెనీ ఈ వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. మొత్తంగా 19,800 మంది కరోనా బారిన పడ్డారని చెప్పింది. కరోనా పరీక్షలను 650 పని ప్రాంతాల్లో రోజుకు 50వేలకు పెంచుతున్నట్లు తెలిపింది. హోల్ ఫుడ్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగుల రేటు అమెరికా జనాభాకు సమానంగా ఉంటే, ఇందులో పాజిటివ్ కేసుల సంఖ్య 33 వేలుగా ఉండే అవకాశముందని వివరించింది. కోవిడ్ బారిన పడకుండా ఉద్యోగులను సంరక్షించేందుకు తమ సంస్థ తీసుకున్న భద్రత చర్యలపై లాజిస్టిక్స్ కేంద్రాల్లో పనిచేసే కొంత మంది ఉద్యోగులు విమర్శించడమే కాకుండా, కరోనా సోకిన తమ సహ ఉద్యోగుల గురించిన సమాచారాన్ని పంచుకోవటానికి కూడా ఇష్టపడలేదని అమెజాన్ పేర్కొంది.