అమెరికాలో ఒక్కరోజే 2500 కరోనా మరణాలు!

వాషింగ్టన్: అమెరికాలో ఒక్కరోజే 2500 కోవిడ్ మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. పండగ సీజన్ కావడంతో అమెరికా ప్రజలు తమ బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు కొద్దిరోజులుగా విపరీతమైన ప్రయాణాలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా వేడుకలను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. అగ్రరాజ్యంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 2,500 మందికి పైగా కరోనా వైరస్ కు బలయ్యారు. ఏప్రిల్ తర్వాత అమెరికాలో ఒక రోజులో ఇంత అత్యధిక మరణాలు చోటు చేసుకోవడం మళ్లీ ఇప్పుడే అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. అమెరికా కాలమానం ప్రకారం.. గత సోమవారం రాత్రి నుండి మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు 1,80,000లకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. చివరిసారిగా ఏప్రిల్ లో మహమ్మారి తీవ్రంగా విజృంభించిన సమయంలో ఒక్క రోజులోనే 2,562 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మంగళవారమే ఇంత ఎక్కువ స్థాయిలో మరణాలు సంభవించాయని యూనివర్సిటీ వివరించింది.