ఆక్లాండ్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ
ఆక్లాండ్: సద్దుల బతుకమ్మ వేడకలు న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఇక్కడ నిర్వహించిన ఉత్సవాల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. న్యూజీలాండ్ దేశ కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఎంపి ప్రియాంకా రాధాకృష్ణన్, ఇండియన్ హై కమిషన్ హానోరారి కాన్సల్ భావ్ దిల్లోన్ హాజరయ్యారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అథితులు మాట్లాడుతూ.. జాగృతి న్యూజీలాండ్ సేవలను, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వాన్ని కొనియాడారు. తమ సహాయ సహకారాలు జాగృతి న్యూజీలాండ్‌కి ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత పంపిన బతుకమ్మ శుభాకాంక్షలు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగ నిలిచింది.
బతుకమ్మ వేడుకల సందర్భంగా `జాగృతి న్యూజీలాండ్` నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే ఎప్పటిలాగే ఈ యేడు కూడా వేడుకల్లో పాల్గొన్న ఆడబిడ్డలను చీరలో సత్కరించారు. ఇక్కడ కరోనా ప్రభావం అంతగా లేనందున అందరూ బతుకమ్మలతో ఆనందంగా వచ్చారు. భారత్ లోని ఇతర రాష్ట్రాల వారు ఈ కార్యక్రమానికి వచ్చి అభినందించారు. మరాఠా, తమిళ, గుజరాతీ, పంజాబీ వాళ్ళు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మ అట పాటలు, గౌరీ పూజ, బతుకమ్మల నిమజ్జనం కార్యక్రమాలతో ఆధ్యంతం ఆహ్లాదబరితంగా సాగింది. పలు రకాల తెలంగాణ వంటకాలతో రుచికరమైన విందును ఏర్పాటు చేశారు.
ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ అధ్యక్షురాలు జ్యోత్గి ముద్దం మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జాగృతి న్యూజీలాండ్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రసన్న గుముడవెల్లి, సరిత, సంధ్య గౌడ్, విక్రమ్ కటుకం, సుకృతి పడాల, హరి ప్రసాద్, నిహారిక నోరి, లావణ్య కోమల్, అంజలి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.