ఆట వస్తువు గొంతుకకు అడ్డుపడి చిన్నారి మృతి

విజయనగరం : చిన్న ఆట వస్తువు చంటి పాప ప్రాణం తీసింది. చిన్నపిల్లలు ఇష్టంగా తినే స్నాక్స్లోని ఆట వస్తువు గొంతుకకు అడ్డుపడటంతో ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి మండలం చినగుడబలో ఆదివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చినగుడబ గ్రామంలో ఎస్సీ వీధికి చెందిన సంధ్యారాణి తన ఏడాదిన్నర కుమార్తె మౌనికకు చిన్నపిల్లలు తినే స్నాక్స్ ప్యాకెట్ ను ఇచ్చింది. స్నాక్స్ తింటూ.. చిన్నారి ఆ ప్యాకెట్లోని తినే పదార్థాలతో ఆట బొమ్మను కూడా మింగడంతో ఆ ఆటవస్తువు పాప గొంతుకకు అడ్డుపడింది. అకస్మాత్తుగా పాప స్పృహతప్పి పడిపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. కాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ చిన్నారి మరణించినట్లు తెలిపారు. వైద్యులు పోస్టుమార్టం చేసి పాప గొంతులో ఇరుక్కున్న ఆట వస్తువును బయటకు తీశారు. ఘటనపై పాప తల్లిదండ్రులు గురుగుబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.