ఆఫ్ఘన్‌లో జంట పేలుళ్లు, 14 మంది మృతి
మరో 50 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
కాబుల్ : ఆఫ్ఘనిస్తాన్‌లోని బామియన్ నగరంలో మంగళవారం జరిగిన రెండు పేలుళ్లలో 15 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. టోమి న్యూస్ బామియన్ నగరంలోని స్థానిక మార్కెట్లో పేలుళ్లు సంభవించాయని వెల్లడించింది. అయితే, పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ముఖ్యంగా, బమియాన్ అత్యంత సురక్షితమైన ప్రావిన్సులలో ఒకటిగా పరిగణిస్తారు.
ఈ బాంబు పేలిన ఘటనలో 13 పౌరులు సహా ఓ ట్రాఫిక్ పోలీసు మరణించారని అధికారులు తెలిపారు. బామియన్ నగరంలో మధ్యాహ్నం జరిగిన పేలుడులో 45 మంది గాయపడినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ తెలిపారు. పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు బాంబులు పేలినట్లు పోలీస్ చీఫ్ ప్రతినిధి మహ్మద్ రెజా యూసుఫీ తెలిపారు. వేలాదిమంది పర్యాటకులు సందర్శించే బమియాన్ లో పేలుళ్లు జరగడం మొదటిసారి. ఈ పేలుళ్లకు కారణమెవరనేది ఇంకా ఎవరూ ప్రకటించలేదు. పేలుళ్లలో క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. ఇటీవల జరిగిన దాడులకు ఐఎస్ అనుబంధ సంస్థ బాధ్యత వహించింది. ఈ దాడిలో కనీసం 50 మంది మృతి చెందగా.. ఇందులో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారు.