ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్న కేసీఆర్

సిద్దిపేట: తనకున్న ఆస్తి వివరాల పత్రాలను చూపెట్టి ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు. సాధారణ పౌరుడిగానే అంగు ఆర్భాటాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులను వివరించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఆస్తుల వివరాలను శనివారం సీఎం స్వయంగా వెల్లడించారు. గృహ వివరాలతో పాటు వ్యవసాయేతర వివరాలను ఎర్రవల్లి గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్‌కు తెలియజేశారు. ఈనెల 15లోపు ప్రతిఒక్కరు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ, పుర ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకే ఈ కార్యక్రమం. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి, అతి పెద్ద ప్రయత్నం. సాగుభూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తాం’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.