ఆ నాలుగు రోజులను వేతన సెలవులుగా పరిగణించండి : ఢిల్లీ హై కోర్టు
న్యూఢిల్లీ: రుతుస్రావ సమయంలో మహిళా ఉద్యోగులకు వేతన సెలవులను మంజూరు చేయాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీ లేబర్ యూనియన్, రాష్ట్ర ప్రభుత్వాలను ఢిల్లీ హై కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా నిబంధనల ప్రకారం చట్టాలు అమలయ్యేలా చూడాలని చీఫ్ జస్టిస్ డిఎన్. పటేల్, జస్టిస్ ప్రతీక్ జైన్‌లతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం పేర్కొంది. రోజువారీ వేతనం పొందేవారితో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్స్ మహిళా ఉద్యోగులందరికీ.. నాలుగు రోజులు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని, ఒకవేళ ఆ సమయంలో విధులు నిర్వహిస్తే.. ఒటిగా పరిగణించాలని కోరుతూ న్యాయవాది రాజీవ్ అగర్వాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రుతు స్రావ సమయంలో సరైన టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించడం లేదని, విధులు నిర్వర్తించే సమయంలో విరామం ఇవ్వడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అధికారులు మహిళా ఉద్యోగులకు తగిన గౌరవం కల్పించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో మహిళలు మానసిక, శారీరక, హార్మోన్ల సమస్యలతో పాటు తీవ్ర ఒత్తిడికి గురవుతారని అన్నారు. ప్రతి నెలా మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను జొమాటో, కల్చర్ మెషీన్ వంటి ప్రైవేట్ సంస్థలు అధికారికంగా గుర్తించడం లేదని న్యాయవాది పేర్కొన్నారు. దీంతో వారికి వేతన సెలవులను మంజూరు చేయాలని కోరారు.