ఇంగ్లాండ్‌లో క్రిస్మస్ వేడుకలపై కఠిన ఆంక్షలు

లండన్: ఇంగ్లాండ్‌లో క్రిస్మస్ వేడుకలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కఠినమైన ఆంక్షలు విధించారు. కరోనా వైరస్‌లో కొత్త రకం(వేరియెంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో రాజధాని లండన్‌తో సహా పశ్చిమ, ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో క్రిస్మస్ వేడుకలపై కొత్త టైర్–4 స్థాయి ఆంక్షలు విధిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ శనివారం ప్రకటించారు. ఇవి ఆదివారం ఉదయం నుంచే అమల్లోకి వస్తాయన్నారు. ప్రధానమంత్రిగా దేశ ప్రజల రక్షణ తన బాధ్యత అని పేర్కొన్నారు.
- ఇంగ్లాండ్‌లో టైర్–4 ప్రాంతంలో ఉన్నవారు క్రిస్మస్ రోజున సొంత ఇంట్లో మినహా బయట ఎక్కడా ఎవరినీ కలవడానికి వీల్లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వారికి మినహాయింపు లభిస్తుంది. ఇతర దినాల్లో విద్య, వైద్యం కోసం బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది.
- టైర్–4 ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు కరోనా ఆంక్షల్లో ఇచ్చిన సడలింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం డిసెంబర్ 25న మాత్రమే ఈ సడలింపులు అమల్లో ఉంటాయి.
- టైర్–4 ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి వ్యాయామశాలలు, సెలూన్లు, అత్యవసరం కాని దుకాణాలు మూసివేయాలి.
∙ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని టైర్–3 ప్రాంతాల్లో టైర్–4 ఆంక్షలను అమలు చేస్తారు. కెంట్, బకింగ్హమ్షైర్, బెర్క్‌షైర్, సుర్రే(వేవెర్లీ మినహా), గోస్పోర్ట్, హావెంట్, పోర్ట్స్మౌత్, రోథర్, హేస్టింగ్స్‌లో టైర్–4 ఆంక్షలు ఉంటాయి. - లండన్ నగరంతోపాటు పశ్చిమ ఇంగ్లాండ్‌లోని బెడ్ఫోర్డ్, సెంట్రల్ బెడ్ఫోర్డ్, మిల్టన్ కీనెస్, లూటన్, పీటర్‌బరో, హెర్ట్‌ఫోర్డ్‌షైర్, ఎసెక్స్(కోలచెస్టర్, అటిల్స్ఫోర్డ్, టెండ్రింగ్ మినహా)లో టైర్–4 ఆంక్షలు అమలవుతాయి.
- యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో అంతర్భాగమైన వేల్స్‌లోనూ క్రిస్మస్ సంబరాలపై ఆంక్షలు విధించారు. ఇవి శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. డిసెంబర్ 23 నుంచి 28వ తేదీ వరకు ఇచ్చిన సడలింపులను కేవలం డిసెంబర్ 25వ తేదీకే పరిమితం చేశారు.