ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం?
70% మార్కులకు సులభ రీతిన వార్షిక పరీక్షలు
హైదరాబాద్: ఈసారి అకడమిక్ ఇయర్‌లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే మొదటి వారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ మేరకు జరిగే మార్పులతో ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 68 రోజులల్లోనే సిలబస్, రివిజన్ పూర్తిచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
కరోనా నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతున్నందున వార్షిక పరీక్షల్లో 70% సిలబస్‌లోనే ఎక్కువ ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఇదివరకు ఐదు ప్రశ్నలిచ్చి మూడింటికి సమాధానాలు రాయాలని సూచించేవారు. ప్రస్తుతం 7 నుంచి 9 ప్రశ్నలిచ్చి మూడింటికి జవాబులు రాసే అవకాశం కల్పించబోతున్నారని సమాచారం.
అనుమతి రాగానే రెండుమూడు రోజుల్లో తేదీలు ఖరారవుతాయని సమాచారం. తొలుత ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించాలని భావించినా, అదే మాసంలో అత్యధికంగా 10 రోజులు సెలవులుండటం, జేఈఈ మెయిన్స్ పరీక్షలతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్నల్ పరీక్షలైన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.