ఇద్దరు కుమార్తెల గొంతు కోసిన తండ్రి
సిద్దిపేట : దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి.. ఇద్దరు ఆడపిల్లల గొంతుకోసి దారుణానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద కూతురు(8), చిన్న కూతురు (6) సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ కలహాల కారణంగానే తండ్రి ఇద్దరు ఆడపిల్లల గొంతుకోసినటట్లు స్థానికులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన ఎండీ మహమ్మద్ 15 సంవత్సరాల క్రితం మిర్‌దొడ్డి మండలంలోని మోతే గ్రామానికి వలస వచ్చాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు. కొంత కాలంగా సైకోలా ప్రవర్తిస్తున్నాడు. దీంతో గ్రామస్తులు వారి కుటుంబాన్ని మోతె నుంచి వెల్లగొట్టడంతో చిట్టాపూర్లో ఉంటున్నారు. శనివారం ఉదయమే పీకల దాకా మద్యం సేవించిన మహమ్మద్.. ఆ మత్తులో తన ఇద్దరు కుమార్తెలను ఇంట్లో బంధించి.. తలుపులు మూసి కూతుళ్ళ గొంతు కొస్తానని బెదిరింపులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసు కానిస్టేబుళ్లు రాజిరెడ్డి, రాజు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు. పిల్లలను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ క్రమంలో పోలీసులిద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.