ఈ బ‌డ్జెట్ ఆశాజ‌న‌కంగా ఉంటుంది: సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ : మార్చి నెల మ‌ధ్య‌లో బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్న‌ట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర 2021 -22 బడ్జెట్ ఆశాజ‌న‌కంగా ఉంటుంద‌ని ఆయ‌న వెల్ల‌డించాఉ. వార్షిక బ‌డ్జెట్ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై ఆర్థిక మంత్రి హ‌రీష్రావు, సిఎస్ సోమేష్ కుమార్‌, ఆర్ధిక శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచార్యులు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్లో సిఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

పలు సంక్షేమ, అభివృద్ది పథకాల అమలుతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని సీఎం తెలిపారు. ఇప్పటికే పంపిణీ చేసిన 3 లక్షల 75 యూనిట్లకు కొనసాగింపుగా మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీకి గాను రానున్న బడ్జెట్‌లో ప్రతిపాదనలను పొందుపరచనున్న‌ట్లు సీఎం తెలిపారు.

కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 50 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని దాని ప్రభావం లక్ష కోట్లకు చేరుకున్నదని సీఎం అన్నారు. కాగా కరోనాంతర పరిస్థితిలో రాష్ట్ర ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని, ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే ఉండే ఆస్కారమున్నదని సీఎం తెలిపారు.

రేపటి నుంచి ఆర్ అండ్ బీ, పంచాయితీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యా, ఇరిగేషన్ తదితరర శాఖలను వరుసగా పిలిచి, ఫైనాన్స్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు సమావేశాలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు. అన్ని శాఖలతో బడ్జెట్‌పై కసరత్తు ముగిసిన తరువాత తుది దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దడం జరుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.