ఉద్యోగాలు ప్రభుత్వ ఆస్పత్రులలో.. వైద్యం ప్రైవేటు ఆసుపత్రులలో..?

మండపేట: మండపేటలో ప్రభుత్వ వైద్యులు తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారి ఉద్యోగాలు మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటాయి… అయితే వారెవరు మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయరు. తమ కాలాన్ని అంతా తమ తమ సొంత నర్సింగ్ హోమ్ లో వైద్యం చేసి లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన మండపేట ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రి ఉంది. కానీ దానిని ఏనాడు పట్టించుకున్న పాపానపోలేదు. దాదాపు 15 గ్రామాలకు కేంద్రంగా ఉన్న మండపేటలో నిత్యం ఏదో ఒక మూల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాద బాధితులు వైద్యానికి ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటారు. అయితే బాధితులను ఓపీ విభాగంలో కూర్చోబెట్టి సంబంధిత డ్యూటీ డాక్టర్లకు ఫోన్ చేయగా వారి వారి ఆసుపత్రిలో ఉన్న వారు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. ఈ కార్యక్రమంలో గంటా గంటన్నర సమయం హరించి పోతుంది. ఈలోగా రోగులు యమలోకానికి దగ్గరలో ఉంటారు. డాక్టర్ ఆస్పత్రికి వచ్చిన తర్వాత వారికి వైద్యం చేసే లోపు హరీ మంటున్నారని కొందరు స్థానికులు అంటున్నారు. ఈ తతంగం పట్టణంలో గత కొన్ని ఏళ్లుగా మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కాంపౌండర్ లు, నర్సులు రాజ్యమేలుతున్నారని కూడా పేషెంట్ల ఆరోప‌ణ‌. కరోనా పుణ్యమా అని డాక్టర్లు డిప్యుటేషన్ పై ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈలోపల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వారిని కాకినాడ రాజమండ్రి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. రోగులకు పూర్తిస్థాయిలో చికిత్స అందించే డాక్టర్ ల కొరత కారణంగా ఇక్కడ ఆపరేషన్లు పూర్తిస్థాయిలో జ‌ర‌గ‌డంలేద‌ని రోగులు అంటున్నారు. దీంతో కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తారు.. అదే కాంపౌండర్ ప్రాథమిక చికిత్స అందించి ఇతర ఆసుపత్రులకు పంపించేస్తారని స్థానికుల వాద‌న‌. ప్రజా ప్రతినిధులు మండపేట ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకోకపోవడం ఇందుకు కారణమని మండపేట పట్టణ ప్రజలు వాపోతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నియంత్రణ లేకపోవడం మూలంగా  ఇక్కడ పనిచేసిన వారందరూ సొంతంగా క్లినిక్ లు నర్సింగ్ హోమ్ లు పెట్టి కోట్లు గడిస్తున్నార‌ని స్థానికులు అంటున్నారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైఎస్సార్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి తోట త్రిమూర్తులు ఈ ప్రభుత్వ ఆసుపత్రి పై దృష్టి సారించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పూర్తి స్థాయిలో 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

టి.వి.గోవిందరావు
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు/ న‌్యాయ‌వాది

Leave A Reply

Your email address will not be published.