ఎన్నిక ఏదైనా గెలుపు `కారు`దే.
గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ రావాలి.. కొత్త రెవెన్యూ చట్టంతో దళితులు, గిరిజనులు, పేదల భూ సమస్యలకు పరిష్కారం.. పోడు భూముల్లో ఉన్న వారికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలిచ్చి హక్కులు కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టిఆర్ఎస్ పార్టీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఓటర్ల నమోదు మరింత ఎక్కువగా జరగాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులంతా సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. వరంగల్ – ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ప్రస్తుతం సిట్టింగ్ పల్లా రాజేశ్వర్ రెడ్డిది కావడంతో వచ్చే ఎన్నికల్లో మరింత ఎక్కవ మెజారిటీతో ఈ స్థానంలో విజయం సాధించాలన్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. “ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ పార్టీదే. సిట్టింగ్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నందున ఈ సీటు మనదే. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజారిటీతో విజయం సాధించాలి. ఏ లక్ష్య సాధన కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో, ఆ లక్ష్య సాధన కోసం అనేక పథకాలు రూపొందించి, రచించి, అమలు చేసి ప్రతి ఒక్కరు సంతోషంగా, సుఖంగా ఉండేవిధంగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే మనం మహబూబాబాద్ జిల్లాను సాధించుకున్నాం. మనం చేసే మంచి పనులు గుర్తించి, ఎన్నిక ఏదైనా ఇక్కడ మనకు మద్దతు ఇస్తున్నారు. అసెంబ్లీ, మునిసిపల్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. రేపటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మద్దతు ఇస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు.
నిన్న కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చాం. ఈ రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని సిఎం కేసిఆర్ గారు దీనిని తీసుకొచ్చారు. వి.ఆర్.ఓ వ్యవస్థను రద్దు చేసి, ఎమ్మార్వోలను బలోపేతం చేశారు. వారికి సబ్ రిజిస్ట్రార్ గా కొత్త బాధ్యతలు ఇచ్చారు.
గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ గారి పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద మహబూబాబాద్ నియోజక వర్గానికి వారి సొంత ఖర్చు 20.50 లక్షలతో అంబులెన్స్ కొనిచ్చారు. దీనిని కేటిఆర్ గారు ప్రారంభించారు. రేపు మహబూబాబాద్ కు రానుంది. మహబూబాబాద్ నియోజక వర్గ ప్రజల తరపున ఎమ్మెల్యేని అభినందిస్తున్నాను.“ అని అన్నారు.
ఎన్నికలపై మంత్రి ప్రసంగిస్తూ.. “ పట్టభద్రుల నియోజక వర్గ ఎన్నికల రాబోతున్నాయి. దీనికి పట్టభద్రుల ఓటర్ నమోదు చేసుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 1,05,000 మంది ఉండగా మహబూబాబాద్ నుంచి దాదాపు 7000పైగా మంది ఓటర్లుగా ఉన్నారు. ఈ సభ్యత్వం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమై నవంబర్ 15వ తేదీ వరకు జరుగుతుంది. పాత ఓటర్ల జాబితా ఉండొద్దు. కొత్తగా అందరినీ మళ్లీ ఓటర్లుగా నమోదు చేయించాల్సిందే. 2017 జూన్ నాటికి పట్టభద్రులైన వారందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పట్టభద్రులందరినీ నమోదు చేసి, 2017 జూన్ నాటికి ప్రతి ఊరు, తండాకి 20 నుంచి 30 మందికి తగ్గకుండా ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత ఎక్కువ అవుతుంది. మన కుటుంబంలో ఉన్న పట్టభద్రులను మొదట నమోదు చేయించాలి. ఆ తర్వాత బంధువులు, చుట్టుపక్కల వారు, గ్రామంలో పట్టభద్రులను నమోదు చేయించాలి. అంగన్ వాడీలలో పట్టభద్రులు, ఏ.ఎన్.ఎంలు, ఆశావర్కర్లు, ఆర్ఎంపీ డాక్టరు, స్టాఫ్ నర్సులు, ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శిలు, వి.ఆర్.ఏలు వీరంతా కూడా పట్టభద్రులైన వారిని గుర్తించి నమోదు చేయించాలి. 15వ తేదీ నాటికి పట్టభద్రులైన వారందరి సమాచారం సేకరించి సమర్పించాలి. మహబూబాబాద్ చుట్టుపక్కల అసైన్డ్ భూములు కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది అక్కడ లేకపోవడం వల్ల ప్రభుత్వం తీసుకుంటుందని ఆందోళన ఉంది.“ అని పేర్కొన్నారు.
అసైన్డ్ భూముల గురించి మంత్రి ప్రసంగిస్తూ.. “ సిఎం కేసిఆర్ గారు చెప్పినట్లు రెండు, మూడు రోజుల్లో ఎస్సీ, ఎస్టీ లకు చెందిన ప్రజా ప్రతినిధులు సమావేశమై అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంపై చర్చిస్తాం. అసైన్డ్ భూములున్న వారి హక్కులు పరిరక్షించే ప్రయత్నం చేస్తాము. మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా అటవీ భూమి ఉంది. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న వారిని ఫారెస్టు వాళ్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ భూముల ఫారెస్టు హక్కులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ భూముల విషయంలో ఫారెస్టు, రెవెన్యూ వాళ్లను సమన్వయం చేసి తగిన సమయంలో ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు ఇచ్చే విధంగా, కొనసాగే విధంగా ప్రయత్నిస్తాం.
భూములు కలిగిన వాళ్లు, వారసత్వంగా వచ్చినా, ప్రభుత్వం ద్వారా వచ్చినా మీ భూములపై హక్కు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాం.
సిఎం కేసిఆర్ గారు తీసుకొచ్చిన కొత్ రెవెన్యూ చట్టం వల్ల పేదలకు, దళితులకు, గిరిజనులకు పెద్ద ఎత్తున లాభం జరగనుంది.“ అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ..“గ్రామస్థాయి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, సింగిల్ విండో డైరెక్టర్, యాక్టివ్ ఉండే వ్యక్తులతో కమిటీ వేసుకోండి. టౌన్ లో చైర్మన్ అధ్యక్షతన వేసిన కమిటీ తొందరగా పనిచేసి, ఏయే ప్రాంతాల్లో ఎంతమంది పట్టభద్రులున్నారో సమాచారం ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు, మెజారిటీలో మహబూబాబాద్ నియోజకవర్గం నెంబర్ వన్ ఉండేవిధంగా, అందరూ ప్రభుత్వంవైపు ఉండేవిధంగా సమిష్టిగా పని చేయాలని కోరుతున్నాను. వి.ఆర్.ఓ వ్యవస్థ రద్దు చేసి వారిని జూనియర్ అసిస్టెంట్లుగా పరిగణించి కోరుకున్న శాఖలో అవకాశం ఇస్తామని సిఎం కేసిఆర్ గారు హామీ ఇచ్చారు. వి.ఆర్.ఏ వ్యవస్థలో చాలా పేదలు 200 రూపాయల జీతం నుంచి ముఖ్యమంత్రి కేసిఆర్ గారి వల్ల 10వేల రూపాయల వేతనం పొందుతున్నారు. వీరందరికి స్కేల్ ఇవ్వాలని నిర్ణయించారు. రిటైర్ మెంట్ కోరుకున్న వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తామని హామి కూడా ఇచ్చారు. ఈ ప్రాంతంలో పోడు భూముల సమస్య ఉంది. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాల జోలికి వెళ్లము, వారికి రైతు బంధు ఇస్తామని సిఎం కేసిఆర్ గారు హామీ ఇచ్చారు. వారందరికి భూమి హక్కు కల్పిస్తామన్నారు. పోడు భూములను రెవెన్యూ వాళ్లు, ఫారెస్టు వాళ్లు మా భూములని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అధైర్యపడొద్దు. పోడు భూముల్లో కాస్తుల్లో ఉన్నవారికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు కూడా ఇస్తామని సిఎం కేసిఆర్ గారు హామీ ఇచ్చారు.“ అని పేర్కొన్నారు.
ఈ సమావేశానికి ముందు మంత్రి స్వగ్రామం గుండ్రాతి మడుగులో పత్తి నాగేశ్వర్ రావు మరణించడంతో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు పరామర్శించి, ఆర్ధిక సాయం చేశారు.