ఎపిలో `పంచాయతీ` ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్న‌ల్‌!

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి గురువారం హైకోర్టు గ్రీన్‌ సిగ్న‌ల్‌ ఇచ్చింది. ఎస్‌ఇసి అప్పీల్‌పై ధ‌ర్మాస‌నం ఎదుట రెండురోజుల కింద‌ట వాద‌న‌లు ముగియ‌గా.. జ‌డ్జిమెంట్ రిజ‌ర్వ్ చేసిన అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇవాళ తీర్పును వెల్ల‌డించింది. ఎన్నిక‌లు, ప్ర‌జారోగ్యం రెండు ముఖ్య‌మేన‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

కాగా ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు విముఖత చూపింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిర్వహించాల్సిన అవసరం ఉండటం, కరోనా కొత్త కేసుల నమోదు తదిరత కారణాలతో ఎన్నికల షెడ్యూల్‌ను నిరాకరిస్తూ కోర్టును ఆశ్రయించింది. పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇటీవల ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎస్‌ఇసి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రెండు రోజులు విచారణ జరిపిన హైకోర్టు సిజె జస్టిస్‌ ఎకె గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పును వెలువరించింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసి సమన్వయం చేసుకొని ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి సమస్య లేకుండా ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది.

ఈ సంద‌ర్భంగా హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రాజ్యాంగంలోని 9,9ఎ షెడ్యూల్ ప్ర‌కారం కాల ప‌రిమితిలోగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ త‌ప్ప‌నిస‌రి అని చెప్పింది. అలాగా త‌మ ప్ర‌తినిధుల‌ను ఎన్నుకునే హ‌క్కు ప్ర‌జ‌ల‌కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఎన్నిక‌లు ఎలా నిర్వ‌హించాల‌న్న అంతిమ నిర్ణ‌యం ఎన్నిక‌ల క‌మిష‌న్‌దే. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఎలాంటి అధికారాలు ఉంటాయో. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు కూడా అలాంటి అధికారాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది.

కాగా హైకోర్టు తాజా తీర్పు నేప‌థ్యంలో షెడ్యూల్ ప్ర‌కార‌మే పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ స్ప‌ష్టంచేశారు.

Leave A Reply

Your email address will not be published.