ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం
హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన కౌంటింగ్‌లో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689 పోలవ్వగా రెండో ప్రాధాన్యతగా 36,580 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,49,269 ఓట్లతో వాణీదేవి విజయఢంకా మోగించారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి గెలుపుతో దీంతో హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్‌లో సంబరాలు మొదలయ్యాయి. నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చుతూ.. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతోపాటు నల్లగొండ స్థానంలో బీజేపీ నాలుగో స్థానంలో నిలిచింది.