ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఊరట
హైదరాబాద్ : సభ్యుల విజ్ఞప్తి మేరకు 131 జీవోను సవరిస్తామని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో ప్రకటించారు. మంత్రి ప్రకటనతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు రాష్ర్ట ప్రభుత్వం ఊరట కల్పించినట్లైంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజల పట్ల గౌరవం ఉన్నది కాబట్టే మొన్న తీసుకువచ్చిన 131 జీవోను సవరిస్తామన్నారు. గతంలో ఎప్పుడైతో వారు రిజిస్ర్టేషన్ చేసుకున్నారో వాటి వాల్యూకు అనుగుణంగానే సవరించిన జీవోను గురువారం విడుదల చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. రిజిస్ర్టేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే రుసుం వసూలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. దీని కోసం జీవోను సవరించి.. రేపే (గురువారం) జీవోను విడుదల చేస్తామని అనధికారిక లే అవుట్లలో తెలియక ప్లాట్లను కొనుగోలు చేసిన వారంతా ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న అనధికారిక ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఇదే మంచి అవకాశమని మంత్రి కేటీఆర్ ఇటీవలే చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ని సద్వినియోగం చేసుకుంటే.. యాజమానులు భూములపై సర్వహక్కులతోపాటు ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాలను పొందడానికి అర్హులవుతారని వివరించారు. వచ్చే అక్టోబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణ ఫీజును వచ్చే ఏడాది జనవరి 31లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు.