ఏపీకి కొత్త సీఎస్ నియామకం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు.
ఆదిత్యనాథ్ దాస్ స్వరాష్ట్రం బీహార్. తల్లిదండ్రులు డాక్టర్ గౌరీ కాంత్ దాస్, కుసుం కుమారి. 1987వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆదిత్యనాథ్ దాస్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్ (1980-84), ఢిల్లీలోని జేఎన్‌యూలో ఇంటర్నేషనల్ స్టడీస్(1984-86) చేశారు. గతంలో విజయనగరం, విజయవాడ అసిస్టెంట్ కలెక్టర్‌గా, కృష్ణాజిల్లా జేసీగా, వరంగల్ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్, మున్సిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆయన పనిచేశారు. అయితే సీనియార్టీలో అజయ్ సాహ్ని, సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ లాంటివారున్నా ఆదిత్యనాథ్ దాస్ వైపే ప్రభుత్వం మొగ్గచూపారని టాక్. ఆదిత్యనాథ్ దాస్ వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.