ఏలూరు ఘటనపై సిఎం జగన్ ఆరా..
మంత్రి ఆళ్ల నానిని అభినందించిన ముఖ్యమంత్రి

ఏలూరు: ఏలూరు ఘటనపై ఎపి సిఎం జగన్ ఫోన్‌లో ఆరా తీశారు. డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సకాలంలో స్పందించి, బాధితులకు బాసటగా నిలిచి.. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టిన మంత్రి నానిని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో వైద్యబృందం, జిల్లా యంత్రాంగం, అధికారుల పనితీరును సీఎం జగన్ అభినందించారు. రాత‍్రంతా మేల్కొని గవర్నమెంట్ ఆస్పత్రిలో బాధితులపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మంత్రి ఆళ్ల నాని పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత
ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందని సీఎం వైఎస్ జగన్ మంత్రి ఆళ్లనానికి భరోసా ఇచ్చారు. ఏలూరులో వివిధ లక్షణాలతో అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటాం. వ్యాధి లక్షణాలను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏలూరుకు వైద్యబృందాలను పంపిస్తున్నాం. ఎలాంటి భయాందోళన చెందొద్దు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా నిపుణులయిన వైద్య పరీక్షలు చేయిద్దాం. అవసరమయితే మెరుగైన వైద్యసదుపాయం కల్పించడం కోసం అన్ని విధాలుగా అండగా ఉంటాం. ప్రత్యేక వైద్యబృందాలు ఈ ఉదయం ఏలూరుకు వస్తున్నాయి. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు అని సిఎం తెలిపారు.