ఐదేళ్ల బాలికపై అత్యాచారం..
కాకినాడ: దిశాలాంటి కఠిన చట్టం తీసుకొచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. 21 రోజుల్లోనే మరణశిక్ష విధిస్తామంటున్నా కామాంధులు భయపడడం లేదు. అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే.. గోళీలపేటకు చెందిన ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఇంట్లో మంచంపై కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మొత్తం వెతకగా.. తెల్లవారుజామున ఊరి చివర దేవాలయం వద్ద బాలిక ఆచూకీ లభించింది. అయితే ఒంటిపై దుస్తులు లేకుండా, తీవ్రగాయాలతో ఆ బాలిక కనిపించడంతో ఆశా వర్కర్ సహాయంతో బాలికను ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు వచ్చే వరకు వైద్యం అందించలేమని కాకినాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు వైద్యం చేసేందుకు నిరాకరించారు. దీంతో స్థానికులు వైద్యులు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి వన్‌టౌన్ సిఐ చొరవతో వైద్యం ప్రారంభించారు. పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.