ఒక్క ఎకరం ఎక్కువున్నా.. ముక్కు నేలకు రాస్తా..: ఈటల జమున

హైదరాబాద్ : తమ హేచరీస్ గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ సతీమణి జమున ఆరోపించారు. అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తమకు తెలుసన్నారు. కష్టపడి పైకి వచ్చామని.. ఎవర్నీ మోసం చేయలేదని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదన్నారు. గోదాములు ఖాళీచేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.
మెదక్ జిల్లా మాసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశాం. ఒక ఎకరం ఎక్కువగా ఉన్న ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు. లేకుంటే సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా? అని నిలదీశారు. తమ స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇది చాలా బాధాకరమన్నారు. 1992లో తాము దేవరయాంజల్ వచ్చామని.. 1994లో అక్కడ భూములు కొన్నామన్నారు.