కరోనా ఎఫెక్ట్: మార్చి 31 వరకూ విద్యాసంస్థలు బంద్!
చండీగఢ్: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం తాజాగా పలు నియంత్రణ చర్యలు చేపట్టంది. పంజాబ్ అంతటా శనివారం నుంచి స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31 వరకూ మెడికల్, నర్సింగ్ కాలేజీలు మినహా అన్ని విద్యా సంస్ధలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో జనాలు గుంపులుగా చేరడాన్ని నిరోధించేందుకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. మాల్స్‌లో వంద మందికి మించి అనుమతించరాదని ఆదేశాలు జారీ చేసింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ మరో రెండు గంటలు పొడిగించాలని నిర్ణయించింది. ఈ జిల్లాల్లో పెండిండ్లు, శుభకార్యాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు కేవలం 20 మందినే అనుమతిస్తామని పేర్కొంది. ఈ జిల్లాల్లో సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, రెస్టారెంట్లు, మాల్స్‌ను ఆదివారం మూసివేయాలని నిర్ణయించారు.