కరోనా బాధితులకు ఇంటికే ఉచిత భోజనం
అపన్నహస్తం అందిస్తున్న పోలీసుశాఖ

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగరంలోని కరోనా బాధితులకు పోలీసు శాఖ ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనుంది. ఇంట్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించనుంది. పలు సంస్థల సహకారంతో పోలీసుశాఖ ఉచితంగా ఇంటికే భోజనం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నవారికి భోజనం అందించే సేవలను గురువారం నుంచి ప్రారంభించింది.
భోజనం కావాల్సిన వారు తమ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి సెల్ నెంబర్ (7799616163)కు వాట్సాప్‌లో సందేశం పంపాలి. బాధితుల పేర్లు, సెల్ నెంబర్, నివాసిత ప్రాంతం, ఇంట్లో రోగుల సంఖ్య తదితర వివరాలను పేర్కొన్నాలి. ఉదయం 6 గంటలకు ముందే వాట్సాప్ నెంబర్‌కు సందేశం పంపాలి. ఆ తరువాత పంపిన వారివి మరుసటి రోజు ఆర్డర్‌గా పరిగణిస్తారు. ఒకరు గరిష్ఠంగా ఐదుగురికి భోజనం ఆర్డర్ చేయొచ్చు. గరిష్ఠంగా ఐదుసార్లు ఆర్డర్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
తొలుత నిత్యం వెయ్యి నుంచి 2 వేల మందికి భోజనం అందించాలని భావిస్తున్నారు. ఈ సేవను మరింత సజావుగా నిర్వహించేందుకు “సేవా ఆహార్” పేరుతో మరోవారం రోజుల్లో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థ, స్వీగ్గీ, బిగ్‌బాస్కెట్, హోప్, కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి `సేవా భోజనం` పేరిట పథకాన్ని ప్రారంభించారు. భోజనం సరఫరాలో సినియర్ సిటిజన్లు, చిన్నారులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు.