కరోనా సోకిన వృద్ధుడి ఆకలి తీర్చి గొప్ప మ‌న‌సు చాటుకున్న నర్సు

తిరువనంతపురం: గ‌త కొన్ని నెల‌లుగా కొవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తోంది. క‌రోనా సోకిందని తెలిస్తే కావాల్సిన వారే చూసీ చూడ‌న‌ట్టు ఉంటున్నారు. కానీ వైద్యులు, న‌ర్సులు మాత్రంలో ఎంద‌రో రోగుల‌కు అన్నీ వారే అయి మ‌రీ సేవ‌లందిస్తున్నారు. ఒక వైపు క‌రోనా మ‌హ‌మ్మారితో యుద్ధం చేస్తూనే మ‌రో వైపు రోగుల‌కు మేమున్నాము అనే భ‌రోసాను ఇస్తూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్నారు. తాజాగా కేర‌ళ‌లో ఒక న‌ర్సు త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకుంది. కోవిడ్ -19 వార్డులో ఒక వృద్ధుడికి తన చేతితో ఆహారం తినిపించిన కేరళ నర్సు స్టెఫీ సైమన్ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. 76 ఏళ్ల గోపి పిళ్ళై కరోనా సోకడంతో అలప్పుజ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో చేరారు. అతనికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో గోపి పిళ్ళై భోజనం చేయడానికి నిరాకరించారు. ఈ సమయంలో నర్సు స్టెఫీ సైమన్ తన చేతితో పిళ్ళైకి ముద్దలు తినిపించి మరీ అతని ఆకలితీర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. అదే వార్డులో ఉన్న సుహైల్‌ సానీ ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave A Reply

Your email address will not be published.