కారులో ఒంటరిగా ఉన్నా.. మాస్కు ధరించాల్సిందే: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోన్న వేళ ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారులో ఒంటిరిగా ప్రయాణిస్తున్నా సరే మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తూ మాస్కు ధరించనందుకు ఢిల్లీ పోలీసులు జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ న్యాయమూర్తి ప్రతిభా ఎం సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
`మీరు కారులో ఒక్కరే ఉన్నప్పటికీ.. మాస్కు ధరించడానికి ఉన్న అభ్యంతరం ఏమిటి? ఇది మీ భద్రత కోసమే. దేశంలో మహమ్మారి తీవ్రత పెరిగింది. టీకాలు తీసుకున్నా.. తీసుకోకపోయినా మాస్కులు ధరించాలి` అని ఢిల్లీ హైకోర్టు పిటిషనర్‌కి వెల్లడించింది.
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో కొత్త ఆంక్షలు విధించింది. కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లినా.. ఆ వ్యక్తి కచ్చితంగా మాస్క్‌ను ధరించాలని తాజా ఆదేశాల్లో పేర్కొన్నది. మాస్క్ అనేది సురక్షా కవచంగా పనిచేస్తుందని, అది కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఒంటరిగా ప్రైవేటు కారుల్లో వెళ్తున్న వారిపై జరిమానా విధించడాన్ని రద్దు చేయాలని దాఖలైన నాలుగు పిటిషన్లను కోర్టు కొట్టిపారేసింది. కారులో ఒక్క ప్రయాణికుడు ఉన్నా.. అది పబ్లిక్ స్పేస్ అవుతుందని కోర్టు తన తీర్పులో చెప్పింది.