కేంద్ర జలశక్తి మంత్రికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా, తనకు సన్నిహితంగా ఉన్న వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిందిగా సూచించారు. కొన్ని లక్షణాలు గమనించిన అనంతరం కరోనా పరీక్ష చేయించుకున్నానని, పాజిటివ్ నిర్థారణైందని అన్నారు. వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. కాగా, సట్లెజ్, యమనా అంశంపై చర్చించేందుకు మంగళవారం షెకావత్, హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖతార్‌తో సమావేశమయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్, వ్యవసాయ శాఖ సహాయక మంత్రి కైలాష్ చౌదరి, అర్జున్ రామ్ మేగ్వాల్, ధర్మేంద్ర ప్రధాన్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణైన సంగతి తెలిసిందే.
ఇప్పటికే కేసుల సంఖ్య 28 లక్షలను దాటింది.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం
కాగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొనే జల వివాదాలను చర్చించి, పరిష్కరించడానికి వీలుగా అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి చైర్మన్ హోదాలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షత వహించాల్సి ఉంది. ఈ నెల 25న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. షెకావత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.