కేంద్ర బృందాలు ఏలూరులోనే..

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అయిదోరోజు బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఏలూరు ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటి వరకు స్థానిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయా కేంద్ర సంస్థలు ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలను శుక్రవారం నాటికి స్పష్టం చేయనున్నాయని సమాచారం. కాగా ఇప్పటి వరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి 26 మంది బాధితులను తరలించగా.. ఇద్దరిని డిశ్చార్జి చేశారు. 24 మంది చికిత్స పొందుతున్నారు.
కేంద్ర బృందాలు, వైద్య నిపుణుల బృందాలు ఏలూరుకు వచ్చిన సంగతి తెలిసినదే. వివిధ విభాగాల నుంచి పంపించిన కేంద్ర వైద్య బృందం, మంగళగిరి ఎయిమ్స్ బృందం, ఏఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్‌సీఐ బృందాలు ప్రస్తుతం ఏలూరులోనే ఉండి బాధితులకు అందే వైద్యంతోపాటుగా కోలుకున్న వారి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి. ఆహార పదార్థాలు, పాలు, కూరగాయలు, ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఉండే మట్టినీ కూడా పరీక్షిస్తున్నాయి. నీరు వచ్చే ప్రాంతాలు, పంట ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.