కేంద్ర మాజీ హోంమంత్రి కన్నుమూత

న్యూఢిల్లీ : కేంద్రమాజీ మంత్రి బూటాసింగ్‌ (86) శనివారం ఉదయం కన్నుమూశారు. రాజ‌స్థాన్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వ‌హించిన బూటా సింగ్‌.. కేంద్ర హోంమంత్రిగా, బీహార్ గ‌వ‌ర్న‌ర్‌గానూ ప‌నిచేశారు. జాతీయ ఎస్సీ క‌మిష‌న్ చైర్మ‌న్‌గాను వ్య‌వ‌హ‌రించారు.

పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లా ముస్తఫాపూర్‌లో 1934, మార్చి 21న బూటాసింగ్‌ జన్మించారు. జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. అకాలీదశ్‌ పార్టీలో చేరి రాజకీయ జీవితం ఆరంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌పార్టీలో చేరారు. దళిత నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. గాంధీ కుటుంబానికి సన్నిహితులయ్యారు. ఎనిమిది పర్యాయాలు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 1970-80 మధ్యకాలంలో ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా కూడా పనిచేశారు. రాజీవ్‌గాంధీ హయాంలో కేంద్రహోంమంత్రిగా విధులు నిర్వర్తించారు. అనంతరం రైల్వే, పార్లమెంటరీ కమిటీ వ్యవహారాలు, క్రీడలు, షిప్పింగ్‌, వ్యవసాయ, సమాచార, గహనిర్మాణ తదితర శాఖల్లో పనిచేశారు. ఆ తర్వాత 2004-06 వరకు బిహార్‌ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. 2007-2010 వరకు ఎస్సీ జాతీయ కమిషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఇక కొన్నాళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీకి దూరమైన ఆయన 2015 అక్టోబరులో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.

బూటాసింగ్ మ‌ర‌ణంప‌ట్ల‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్ర‌క‌టించారు. “ఆయ‌న ఒక అనుభ‌వ‌శీలి. పేద‌, అణ‌గారిన వ‌ర్గాల ప‌క్షాన త‌న గొంతుక వినిపించారు. ఆయ‌న కుటుంబానికి, అనుచ‌రుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి“ అని ప్ర‌క‌టించారు.
కాంగ్రెస్‌పార్టీ నేత రాహుల్‌గాంధీ సైతం ట్విట్టర్‌ ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.