కేసులు పెండింగులో లేకుండా చూసుకోవాలి : డిఐజి రంగనాధ్

నల్లగొండ: జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ నేర విచారణలో మరింత సమర్ధవంతంగా పని చేయాలని పోలీస్ అధికారులను డిఐజి, జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని ఆయన సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై మరింత దృష్టి సారించి అవసమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన సూచనలు చేయాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. రాబోయే మార్చి నెల వరకు రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించే విధంగా చూడాలని డిజిపి అదేశించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడంతో పాటు పోలీస్ అధికారులు సైతం చొరవ చూపినప్పుడే ఫలితం వస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ప్రతి పోలీస్ అధికారి ఈ రెండు అంశాలపై శ్రద్ద వహించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిసి కెమెరాలన్ని పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమ్యూనిటీ పోలీసింగ్, నేను సైతం కింద కొత్త సిసి కెమెరాలు ఏర్పాటు చేయించే విధంగా చూడాల్సిన బాధ్యత సంబంధిత పోలీస్ అధికారులపైనే ఉన్నదన్నారు. ఎప్పటికప్పుడు సిసి కెమెరాలు పని చేస్తున్నాయో, లేదో అనే విషయాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సిసి కెమెరాల ద్వారా ఎన్నో రకాల నేరాలను చేధించిన విషయాలను గుర్తుంచుకొని వాటి నిర్వహణ పట్ల శ్రద్ద వహించాలన్నారు. రాబోయే వారం రోజులలో జిల్లాలోని అన్ని సిసి కెమెరాలు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
త్వరలో జిల్లాలోని పోలీస్ స్టేషన్లను సందర్శించడంతో పాటు జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ల వారీగా పనితీరు సమగ్రంగా సమీక్షించడం జరుగుతుందని డిఐజి రంగనాధ్ తెలిపారు. సమావేశంలో వివిధ పోలీస్ స్టేషన్ల వారీగా ప్రాపర్టీ, పొక్సో కేసుల గురించి, విచారణలో ఉన్న కేసుల వివరాలు, నేర విచారణలో అధికారుల పనితీరు తదితర అంశాలను సమీక్షించారు.
సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద, సమావేశంలో డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, సిఐలు రవీందర్, గౌరు నాయుడు,, నిగిడాల సురేష్, మహబూబ్ బాషా, పి.ఎన్. డి. ప్రసాద్, పరుశురాం, శంకర్ రెడ్డి, సురేష్ కుమార్, రాజశేఖర్ గౌడ్, వెంకటేశ్వర్లు, ఆదిరెడ్డి, నాగరాజు, బాలగోపాల్, ఎస్.ఐ.లు రాజశేఖర్ రెడ్డి, నర్సింహా, కొండల్ రెడ్డి, విజయ్ కుమార్, సైదాబాబు, సైదులు తదితరులున్నారు.