కేసుల పరిష్కారం కోసం జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్

హైదరాబాద్: రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు కూడా వెంటనే అమల్లోకి వచ్చాయి. తెలంగాణ భూమి హక్కులు – పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం – 2020 లోని సెక్షన్ 16, 17 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునళ్ల మార్గదర్శకాలను సీఎస్ సోమేశ్‌కుమార్ జారీచేశారు.
పట్టదారు పాస్‌పుస్తకాల చట్టం – 2020 సెక్షన్ 13 ప్రకారం తమ వద్దకు వచ్చిన కేసులపై దర్యాప్తు చేపట్టే అధికారం స్పెషల్ ట్రిబ్యునల్‌కు ఉంటుంది. గరిష్ఠంగా నెలరోజుల్లో కేసులను పరిష్కరించాలి. ప్రత్యేక ట్రిబ్యునల్ జారీచేసిన ఆదేశాలే అంతిమం. పరిష్కారం అయిన కేసుల రికార్డు కలెక్టరేట్‌లో మాన్యువల్ ప్రకారం భద్రపరుస్తారు. కాగా ప్రతి జిల్లాలో ఇద్దరు సభ్యులతో కూడిన స్పెషల్ ట్రిబ్యునల్ ఉంటుంది. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సభ్యులుగా ఉంటారు. ఏదైనా జిల్లాలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పోస్టు ఖాళీగా ఉంటే అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సభ్యుడిగా ఉంటారు. ఆర్‌వోఆర్ యాక్ట్ – 1971 ప్రకారం.. ఇప్పటివరకు జిల్లాల పరిధిలో రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ ప్రత్యేక ట్రిబ్యునల్‌కు బదిలీ అవుతాయి. వాటిని జిల్లా కేంద్రంలోనే విచారణ చేపడుతారు. అవసరం మేరకు జిల్లా కలెక్టర్ తన జిల్లా పరిధిలో ఎవరైనా ఉద్యోగులను సహాయకులుగా వినియోగించుకోవచ్చు.