కొత్త లేబర్ కోడ్.. వారానికి 4 రోజులే పని!
న్యూఢిల్లీ: త్వరలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది. ఉద్యోగుల కోసం ఓ కొత్త లేబర్ కోడ్‌ను తీసుకువచ్చే పనిలో ఉంది. ఈ కొత్త కోడ్ ప్రకారం ఇక కంపెనీలు వారానికి నాలుగు రోజుల పాటే ఉద్యోగులతో పని చేయించుకునే వీలు కలుగుతుంది. అయితే వారంలో మొత్తంగా 48 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అయితే, దీనిలో కూడా కొన్ని ఆప్షన్లు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వారంలో నాలుగు రోజుల పని దినాలైతే 12 గంటల పరిమితితో అమలు చేయనుండగా… 5 రోజుల పని దినాలు అయితే 10 గంటల పరిమితి విధించనున్నారు. ఇక ఆరు రోజుల పని దినాలు అయితే, యథావిథిగా 8 గంటల పరిమితి అమలు చేయవచ్చు. కంపెనీలకు వారానికి నాలుగు రోజుల పనిదినాలు ఎంపిక చేసుకునే అవకాశం ఉందని, అయితే, ఉద్యోగులు ఎక్కువ షిఫ్టులకు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా వారానికి ఎన్ని రోజులు పని అన్న విషయంలో తాము ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ కొత్త కోడ్ వల్ల కంపెనీలు, ఉద్యోగులకు పని చేసే రోజుల్లో కాస్త వెసులుబాటు కలుగుతుందని అపూర్వ చంద్ర చెప్పారు. ఈ కొత్త కోడ్ ముసాయిదా నిబంధనలు చివరి దశలో ఉన్నాయని, చాలా వరకూ రాష్ట్రాలు కూడా తమ సొంత నిబంధనలు రూపొందించే ప్రక్రియలో ఉన్నాయని తెలిపారు. కాగా డిసెంబర్‌లో రూపొందించిన ముసాయిదా నిబంధనలను అనుసరించి, 2020 సెప్టెంబర్‌లో పార్లమెంటులో నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్రం ఆమోదించింది. కార్మిక నియమాలకు తుది మెరుగులు దిద్దుతోందని, రాష్ట్రాలు కూడా తమ సొంత నిబంధనల ముసాయిదాతో వస్తున్నాయని వెల్లడించారు చంద్ర.