కోవిడ్ కట్టడికి సింగరేణి రూ.71 కోట్లతో వసతులు

హైదరాబాద్ : కొవిడ్ నియంత్రణకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) పటిష్ఠ చర్యలు చేపట్టిందని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో భాగంగా ఏరియా ఆస్పత్రుల్లో రూ.71 కోట్ల వ్యయంతో వసతులు కల్పించినట్లు వెల్లడించారు.
సింగరేణి ఐదు ప్రదేశాలలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. 1.25 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లను రూ .3.16 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. మొత్తం 99,406 మంది పరీక్షలు చేయించుకోగా వీరిలో 12,308 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 9,938 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. 2,267 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..
సింగరేణిలో వర్కర్స్ మొత్తం 44 వేలు. వీరిలో కేవలం 783 మంది మాత్రమే కొవిడ్ బారిన పడ్డారు. మిగతా వారు వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఉద్యోగులకు ప్రత్యేక మెడికల్ సర్వీసుల నిమిత్తం మేనేజ్మెంట్ రూ.38 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇలా 42 మందిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించినట్లు చెప్పారు.