కౌంటింగ్: 16 మంది అభ్యర్థుల ఎలిమినేషన్
నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అయినా ఎవరికీ 51 శాతం ఓట్లు దక్కలేదు. దీంతో ఫలితం కోసం రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. రెండో దశలో తక్కువ ఓట్లు వచ్చిన 16 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తయ్యింది. తక్కువ ఓట్లు వచ్చిన 10 మంది తొలి గంటన్నరలోనే ఎలిమినేట్ అయ్యారు. వీరికి 10 నుంచి 15 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
7 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత లెక్కింపులో..
సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో
- పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,10,840 ఓట్లు
- మల్లన్నకు 83,290 ఓట్లు
- ప్రొఫెసర్ కోదండరామ్‌కు 70,072 ఓట్లు
- ప్రేమేందర్ రెడ్డికి 39,107 ఓట్లు
- రాములు నాయక్‌కు 27,588 వచ్చాయి.
- ఈ ఏడు రౌండ్లలో కలిపి 21,636 చెల్లని ఓట్లు పోలయ్యాయి.

కాగా, పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందాలంటే ఇంకా 72,327 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఇక తీన్మార్ మల్లన్నకు 99,877, ప్రొఫెసర్ కోదండరామ్‌కు విజయం కోసం 1,13,095 ఓట్లు కావాల్సి ఉంటుంది. అయితే రెండో ప్రాధాన్యతలోనూ ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడంలేదు. అందరిని ఎలిమినేషన్ చేసిన తరువాత ఇద్దరు మాత్రమే మిగిలితే.. అందులో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా నిర్ణయిస్తారు.