కౌంటింగ్: వీడని ఉత్కంఠ
మూడు రోజులైనా పట్టభద్రుల ఎన్నికల ఫలితాల ఉత్కంఠ వీడలేదు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఈ రోజు రాత్రికి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నల్లగొండలో 67 మంది, హైదరాబాద్‌లో 87 మంది చొప్పున అభ్యర్థులను ఎలిమినేషన్ చేసి లెక్కిస్తున్నారు. ప్రతీ రౌండ్‌లోనూ టిఆర్ ఎస్ ఆధిక్యత కనపరిచినప్పటకి.. వ్యత్యాసం తక్కువగా ఉండటం ఆసక్తిని పెంచుతోంది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నాలుగో రోజు కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో స్పష్టత రాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు కలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 3,930 ఎలిమినేషన్ ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుకు 1,919, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుకు 2,477, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 2,044 ఎలిమినేషన్ ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థిపై వాణీదేవి 10,035 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు వాణీదేవికి 1,16,619 ఓట్లు, రాంచందర్‌రావుకు 1,06,584, ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుకు 56,087, చిన్నారెడ్డికి 33,598 ఓట్లు లభించాయి. ఇక్కడ అభ్యర్థి విజయానికి 1,68,520 ఓట్లు అవసరం.
నల్గొండలో ఆధిక్యంలో పల్లా
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యం ఓట్లలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నల్గొండ పట్టభద్రుల స్థానంలో 65 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు బదిలీ చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 2,224 ఎలిమినేషన్ ఓట్లు లభించగా.. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 2,488, ప్రొఫెసర్ కోదండరామ్‌కు 2,166 ఓట్లు వచ్చాయి. ఎలిమినేషన్ ఓట్లు కలుపుకొని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,14,046 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 86,614, కోదండరామ్‌కు 73,286, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 40,594 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి విజయానికి 1,83,167 ఓట్లు అవసరం.