క్విక్ రియాక్షన్ మిసైల్ సిస్టమ్ ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో ఘన విజయం సాధించింది. క్విక్ రియాక్షన్ మిసైల్ సిస్టమ్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది భూమి నుంచి గగనతలానికి ప్రయోగించే మిసైల్ సిస్టమ్. ఈ మిసైల్ తన లక్ష్యాన్ని నేరుగా ఛేదించింది. పైలట్‌లేని లక్షిత విమానాన్ని (పీటీఏ) కూల్చివేయడంలో క్యూఆర్‌ఎస్‌ఏఎం వ్యవస్థ విజయవంతమైనట్టు రక్షణ శాఖ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఒడిశాలోని చాందీపూర్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఈ పరీక్ష నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ఈ క్షిపణి వ్యవస్థతో శత్రు క్షిపణులను, విమానాలను గుర్తించవచ్చని పేర్కొన్నారు. కదులుతున్న లక్ష్యాలను కూడా ఈ క్షిపణి సమర్థమంతంగా కూల్చివేస్తుందని వెల్లడించారు. ఏకకాలంలో ఆరు క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యమున్న క్యూఆర్‌ఎస్‌ఏఎం వ్యవస్థలో బ్యాటరీ మల్టీ ఫంక్షన్‌ రాడార్‌, బ్యాటరీ పర్యవేక్షణ రాడార్‌, మొబైల్‌ లాంచర్‌ వంటి పరికరాలు ఉంటాయి.

Leave A Reply

Your email address will not be published.