కనకదుర్గమ్మ వారధిపై కారు దగ్ధం

విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ వారధిపై మంగళవారం మధ్యాహ్నం (ఎపి 16 సియు 0456 ఎన్‌క్యూటి డస్టర్ ) కారు దగ్ధమైంది. విజయవాడలో గూడవల్లి నారాయణ కాలేజ్ లో బుక్స్, సర్టిఫికెట్ కోసం వెన్నంగంటి మురళీధర్ రెడ్డి, తండ్రి వెంకటరెడ్డి, కూతురు సాయి శావ్య, కారు డ్రైవర్ లు కలిసి ఒంగోలు నుండి కంపెనీ కారులో వస్తుండగా, మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారధి అటవీశాఖ చెక్ పోస్ట్ వద్దకు రాగానే వైర్లలో షార్ట్ సర్క్యూట్ వల్ల అకస్మాత్తుగా కారులో నుండి పొగలు వచ్చాయి. కారులో ఉన్నవారంతా వెంటనే అప్రమత్తమై కారు దిగిపోయారు. మంటలు రాజుకొని కారు పూర్తిగా దగ్ధమైంది. కారులోఉన్న ఆయిల్ ట్యాంకు పేలడంతో మంటలు ఒక్కసారిగా రాజుకున్నట్లు తెలుస్తోంది. మంటలు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.