కరోనా దెబ్బకి 8 కోట్ల ఉద్యోగాలు ఊస్ట్!
న్యూఢిల్లీ: కరోనా మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ 2020 సంవత్సరంలో ఎంత మంది ఉద్యోగాలు ఊడాయో అనే దానిపై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) పక్కాగా లెక్కలు వేసింది. కరోనా మూలంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 8.1 కోట్ల ఉద్యోగాలు పోయాయని ఐఎల్ఓ వెల్లడించింది. ఇందులో మహిళలు, యువత ఎక్కువగా ప్రభావితమైనట్లు తెలిపింది. ఈ ప్రాంతంలోని లేబర్ మార్కెట్లపై కొవిడ్-19 గట్టి దెబ్బే కొట్టిందని ఐఎల్ఓ చెప్పింది. ఈ ప్రాంతంలో సామాజిక భద్రత కవరేజీ తక్కువగా ఉండటం, సంస్థాగత సామర్థ్యం పరిమిత స్థాయిలో ఉండటం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారిని, మూత పడిన సంస్థలను ఆదుకోలేకపోయారని ఐఎల్ఓ ఆసియా, పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ చిహోకో అసదా మియకావా చెప్పారు. కొవిడ్ కంటే ముందుతో పోలిస్తే ఈ సంక్షోభ సమయంలో ఉద్యోగ రేటు 4.2 శాతం మేర పతనమైనట్లు గుర్తించారు. ముఖ్యంగా యువత పని గంటలు, ఉద్యోగాలు కోల్పోవడం విషయంలో ఎక్కువగా ప్రభావితమైనట్లు తెలిపారు.