గురువుకు వందనం!

`క్లాసులో ప్రవేశిస్తున్న ప్రతిసారీ.. అతని కుడిచేతికి ఆరో వేలు అదనంగా మొలుస్తుంది.. అది కచ్చితంగా జ్ఞానం ఘనీభవించిన తెల్లని సుద్దముక్కే.. అతనొక నలభై నిమిషాలు కురిసి కురిసి అలసిసొలసిన మేఘమౌతాడు.. ఆ తోటలోని పూల మొక్కలు.. మొదలంతా తడిసి తడిసి.. తృప్తిగా తలలు ఊపుతాయి`
బడిపంతులు అంటే కేవలం ఒక వృత్తి కాదు… అధికార దర్పం ప్రదర్శించే ఉద్యోగం అంతకన్నా కాదు. ఉపాధ్యాయ వృత్తి అంటే నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దటం. ఇదొక బృహత్తర కార్యక్రమం. కాబట్టే తల్లిదండ్రులతో పాటే గురువుకి ప్రాధాన్యతనిచ్చింది. మనలోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపి.. మార్గదర్శనం చేసేది గురువు. నిస్సందేహంగా మంచి గురువు ఒక సామాజిక వైద్యవేత్త. మనకు ఎలాంటి రక్తసబంధంలేని ఆత్మబంధువు గురువు..
ప్రతీ మనిషికి జీవితంలో నవమాసాలు మోసి జన్మనిచ్చిన అమ్మ మొదటి గురువైతే..
నడత నేర్పిన నాన్న రెండో గురువు..
ఆ తర్వాత బతుకుబాటలో జీవన మార్గదర్శనం చేసే మార్గదర్శి మూడో గురువు.. అందుకే ఏ రక్త సంబంధంలేని ఆత్మబంధువు గురువు.. అని అన్నాడు మన మాజీ రాష్ట్రపతి అబ్బుల్ కలాం.
గురువు జీవితంలో అంత గొప్పవాడు కాబట్టే ప్రాచీన కాలం నుంచి ఈ ప్రాశ్చాత్య పోకడలున్న రోజులలో కూడా గురువుస్థానం మారలేదు.. మారదు.. అందుకే మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ.. అని అన్నారు. నిత్యం విద్యార్థుల ఎదుగుదలను కోరుకునే గురువుకు కరోనా కాలంలో ఎవరూ ఊహించని కష్టమొచ్చి పడింది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో బడులున్నాయి. అవి ప్రైవేటు, ప్రభుత్వం ఏవైనా కావచ్చు.. ఈ స్కూళ్లలో దాదాపు 30 లక్షల మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సర్కారు బడుల్లో చేసే ఉపాధ్యాయుల సంగతి సరే.. కాని ప్రవేటు పాఠశాలల్లో దాదాపు 3 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా దెబ్బకు ఉపాధ్యాయుడు కకావికలమైపోతున్నాడు. అలాంటి గురువుకు కరోనా కారుచీకట్లు అలముకున్నాయి. కరోనా కారణంగా మార్చి 19వ తేదీ నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. ఒక్కో పాఠశాలలో కేవలం పది శాతం మందికి మాత్రమే ఆన్‌లైన్ క్లాసులు చెప్పే అవకాశం వచ్చింది. ఇక మిగతా టీచర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ‘పరిస్థితులు బాగుపడి, పాఠశాలలు తెరిచేదాకా జీతాలు చెల్లించలేం!’ అని చెప్పేసి చేతులు దులుపుకున్నాయి యాజమాన్యాలు. అందులో కార్పొరేట్ యాజమాన్యాలే కీలకం. ఇలా ఉపాధి పోయి.. పూటగడవక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎందరో! కరోనా దెబ్బకు విద్యాసంస్థలు నడవకపోవడం.. యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోవడంతో 40వేల మంది మాస్టార్లు వీధినపడ్డారు!
నేడు ఉపాధ్యాయ దినోత్సవం! ఈ సందర్భంగా ఓ పుష్పగుచ్ఛం, అభినందనలతో కూడిన నాలుగు మాటలు, కొన్ని చప్పట్లు.. వారి హృదయాలను ఉప్పొంగించగలవేమో! కానీ పనిలేక.. ఆకలితో నకనకలాడుతున్న తమ కుటుంబసభ్యులకు పట్టెడన్నం పెట్టలేక.. వారి గుండె లోతుల్లోని బాధ అర్థమయ్యేదెవరికి? వారి కంటి పొరల్లో దాగిన కన్నీరు కనిపించేది ఎంతమందికి? ఈ కరోనా కాలంలో పాఠశాలలు తెరుచుకునేదెప్పుడో, జీతాలు వచ్చేదెప్పుడో అర్థంకాని దుస్థితి వారిది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పస్తులుంచలేక కొందరు ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. కుటుంబ పోషణ కోసం బేషజాలకు పోకుండా కొందరు పండ్లు అమ్ముకోవడానికీ, కాయకష్టం చేయటానికీ సిద్ధపడ్డారు. పొట్టకూటి కోసం కూలీలుగా, చిరు వ్యాపారులుగా, రైతులుగా మారారు. మరికొందరు ఆన్‌లైన్ క్లాసులు చెప్పడంలో వినూత్న పద్ధతులను అవలంబిస్తూ పిల్లలకు మరింత చేరువవుతున్నారు. ఇంకొందరు ఆన్‌లైన్ టీచింగ్‌పై శిక్షణ తీసుకుని మరీ పిల్లలకు బోధిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
మనలో మామూలు చిరు ఉద్యోగులు కావచ్చు.. కండక్టర్లు కావచ్చు, కలెక్టర్లు అయిఉండొచ్చు.. నాయకులు కావచ్చు… అసలేమీ అయిఉండకపోవచ్చు.. కానీ ఈ రోజున మన కుటుంబాన్ని మనం పోషించుకునే యోగ్యతలో ఉన్నామంటే అందుకు గురువు కదా కారణం. మన బడిలో పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్నాకానీ బతుకుబాటకు ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయుడు ఒక్కరే ఉంటారు… ఈ రోజు వారి రోజు.. అందుకే వారిని తలుచుకుందాం ఈ రోజు. వారిని పలకరిద్దాం ఈరోజు. వీలైతే కలుసుకుందా ఈరోజు.. గురువుకు వందనం చెబుదాం ఈ రోజు!
రక్త సంభంధం లేని ఆత్మ బంధం అని అద్భుతంగా వర్ణించారు.
పాపం ప్రైవేటు ఉపాద్యాయులు ఈ రోజు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందరికో బ్రతుకునిచ్చి ఈ రోజు బలి పీఠం మీద ఉన్నారు.
పదుల సంఖ్యలో ఒకరు బ్రతుకు బాట వేసేవారు ఉంటారు.
వారిది ఈ రోజు అని ఎంతో బాగా చెప్పారు. చదివించారు, కదిలించారు. కడుపునింపారు.
కృతజ్ఞతలు